బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్ తీయడం కత్తిమీద సామే. ‘జైలర్ 2’ విషయంలో దర్శకుడు నెల్సన్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ‘జైలర్’ రజనీకాంత్ కెరీర్లోనే మెమొరబుల్ హిట్. ఆ సినిమాకు సీక్వెల్ అంటే అంతకు మించి ఉండాలి. నిజానికి ‘జైలర్’లో ఆయన రజనీకాంత్ క్యారెక్టర్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపించారు. ఆయన పాత్రను ఎలివేట్ చేయడానికి ఓ వైపు అనిరుథ్ని, మరోవైపు గెస్ట్రోల్స్ని వాడారు. కానీ ప్రతిసారీ ఈ మ్యాజిక్ వర్కవుట్ అవ్వదు. అందుకే.. ఈ సారి కథపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారట నెల్సన్.
‘జైలర్’లో శక్తివంతమైన విలన్‌తో ముత్తువేల్ పాండియన్(రజనీ) పోరాడతాడు. కానీ ‘జైలర్ 2’లో ఆయన పోరాడేది కేవలం ఒక్క విలన్‌తో కాదంట. విలన్ ఫ్యామిలీతోనే పోరాడాల్సివస్తుందట. ఈ విలన్ సామ్రాజానికి అధిపతిగా బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి నటిస్తున్నారని తెలిసింది. ఆయన కూతురిగా మరో శక్తివంతమైన విలన్ పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తారట.
హీరో ఫ్యామిలీ వర్సెస్ విలన్ ఫ్యామిలీ అన్నట్లు సినిమా నడుస్తుందని చెన్నై సమాచారం. ‘జైలర్’లో గెస్ట్రోల్స్ చేసిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ఇందులోనూ కనిపించనున్నారు. అలాగే.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు చాలు.