Avatar 3 | దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ప్రమోషన్ కూడా ఓ రేంజ్‌లోనే ఉంటుంది. ప్రేక్షకుల్లో హైప్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆయనకి బాగా తెలుసు. ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాని ఓ రేంజ్లో ప్రమోట్ చేసే స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు.. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన గ్లింప్స్ ఈవెంట్‌తో సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడేమో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో వినిపించిన ఈ రూమర్… తాజాగా మరోసారి హాలీవుడ్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3 – Fire and Ash) డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ పెద్ద సర్ప్రైజ్గా ‘వారణాసి’ స్పెషల్ గ్లింప్స్ ను జక్కన్న ప్లాన్ చేస్తున్నారని హాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. రాజమౌళి – కామెరూన్ మధ్య ఉన్న పరస్పర అభిమానం అందరికీ తెలుసు. RRR, బాహుబలి చూసి జేమ్స్ కామెరూన్ చేసిన ప్రశంసలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ బంధం మరింత క్రియేటివ్ ప్రమోషన్‌గా మారబోతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
ఒక వేళ ఇది నిజమైతే…‘వారణాసి’కి గ్లోబల్‌గా అద్భుతమైన మైలేజ్ రానుంది. అలానే విడుదలకన్నా ముందే అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ వస్తుంది. ప్రపంచ సినిమా ప్రేక్షకుల దృష్టి నేరుగా మహేశ్–రాజమౌళి కాంబోపై పడడం ఖాయం అని చెప్పవచ్చు. వారణాసి చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. కె.ఎల్.నారాయణ (శ్రీదుర్గా ఆర్ట్స్) చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అన్నీ కుదిరితే మూవీ 2027లో విడుదల కానుంది. మొత్తానికి… ‘అవతార్ 3’లో ‘వారణాసి’ స్పెషల్ వీడియో నిజమైతే, ఇది ఇండియన్ సినిమా ప్రమోషన్స్‌లో గ్లోబల్ గేమ్‌చేంజర్ అవుతుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.