SS Rajamouli | ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గురువారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయానికి స్వయంగా విచ్చేశారు. ఆయన తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయించడం కోసం అక్కడికి వచ్చినట్లు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (జేటీసీ) రమేష్ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ఒక భారీ పాన్-ఇండియా సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, విదేశాల్లో వాహనం నడపడానికి అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రాజమౌళి స్వయంగా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు.
లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా, రాజమౌళి అక్కడ తన సంతకం చేశారు. అనంతరం అధికారులు ఆయన ఫోటోను తీసుకున్నారు. అనంతరం, రవాణాశాఖ అధికారులు ఆయనకు నూతన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు. రాజమౌళి సాధారణ పౌరుడిలా కార్యాలయానికి వచ్చి తన పని పూర్తి చేసుకుని వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సింప్లిసిటీని పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది సైతం ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.