Royal Albert Hall London | దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఇప్పటికే ఆస్కార్ సహా అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం, లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో నేడు (మే 11, 2025) లైవ్ కాన్సర్ట్ ప్రదర్శనతో మరో మైలురాయిని చేరుకోనుంది.
ఇప్పటికే తన మైనపు విగ్రహావిష్కరణ కోసం లండన్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఈ ప్రత్యేక కార్యక్రమంకి హాజరుకానున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఇప్పటికే లండన్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి, బెన్ పోప్ నేతృత్వంలో కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’ సంగీతాన్ని ప్రత్యక్షంగా వినిపించనున్నారు.
అయితే, ఈ లైవ్ కాన్సర్ట్‌కు మరింత ప్రత్యేకతను సంతరిస్తూ.. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ వేడుకకు రాబోతున్నాడు. రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ కాన్సర్ట్ ప్రదర్శన పొందుతున్న రెండో భారతీయ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు సాధించబోతుంది. ఇంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 కూడా ఇందులో ప్రదర్శించబడింది. 148 సంవత్సరాల రాయల్ ఆల్బర్ట్ హాల్ చరిత్రలో లైవ్‌లో ప్రదర్శించబడిన మొదటి విదేశీ భాషా చిత్రంగా బాహుబలి 2 రికార్డు సృష్టించింది.