Raja Saab |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు తొలి రోజే థియేటర్ల వద్ద సందడి కనిపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సంబరాలు హద్దులు దాటాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను ఎనర్జిటిక్‌గా, పూర్తి జోష్‌తో చూడటం అభిమానులను ఉత్సాహపరిచింది. అయితే సినిమా కథనం, స్క్రీన్‌ప్లే, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ, నిడివి ఎక్కువగా ఉండటం, గ్రాఫిక్స్ బలహీనంగా అనిపించడంతో పలువురు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభాస్ స్టార్ పవర్ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది.
ఈ ఉత్సాహం కొన్ని చోట్ల ప్రమాదకరంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ సినిమా సందడి కనిపించగా, ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ థియేటర్లో జరిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘ది రాజా సాబ్’ ప్రదర్శన సమయంలో ప్రభాస్ ఎంట్రీ సీన్ రాగానే కొందరు అభిమానులు హద్దులు దాటి థియేటర్లోనే టపాసులు పేల్చారు. ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో థియేటర్లో గందరగోళం నెలకొంది. టపాసుల నుంచి వచ్చిన నిప్పురవ్వలు స్క్రీన్ ముందు ఉన్న పేపర్ ముక్కలపై పడటంతో మంటలు చెలరేగాయి. పరిస్థితి వేగంగా ప్రమాదకరంగా మారే అవకాశముండటంతో థియేటర్ సిబ్బంది, ప్రేక్షకులు అప్రమత్తమయ్యారు.
వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే క్షణాల వ్యవధిలో తీసుకున్న చర్యల వల్లే ప్రాణనష్టం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. సినిమా కోసం అభిమానాన్ని చాటుకోవడం సహజమే అయినా, థియేటర్లో టపాసులు పేల్చడం నిబంధనలకు విరుద్ధమని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద విపత్తుకు దారి తీస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. థియేటర్లలో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు, ‘ది రాజా సాబ్’కు సంబంధించి సోషల్ మీడియాలో మరో చర్చ కొనసాగుతోంది. సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు మారుతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్లపై కొంతమంది ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాజాసాబ్ క్రేజ్ హద్దులు దాటింది… రాయగడ థియేటర్లో అగ్నికలకలం
రాజాసాబ్ రిలీజ్ సందర్భంగా ఒడిశాలోని రాయగడలో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. థియేటర్లో బాణసంచా పేల్చడంతో స్క్రీన్ ముందున్న కాగితాలపై పడి మంటలు చెలరేగాయి. హాల్ యాజమాన్యం, కొందరు ప్రేక్షకులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు.… pic.twitter.com/y7XtvMkhCG
— Milagro Movies (@MilagroMovies) January 9, 2026