Raja Saab | రణవీర్ సింగ్ నటించిన మెగా యాక్షన్ డ్రామా ‘దురంధర్’ విడుదలై ఇప్పటికే 38 రోజులు పూర్తయినా, బాక్సాఫీస్ వద్ద దాని దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరో పది రోజుల్లో ఓటీటీలోకి రానున్నప్పటికీ, ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లకే వెళ్లి ఈ సినిమాను చూడటం విశేషంగా మారింది. ప్రస్తుతం మందగమనం ఎదుర్కొంటున్న బాలీవుడ్‌కు ఒక్కసారిగా ఊపునిచ్చిన సినిమాగా ‘దురంధర్’ నిలిచిందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల కాలంలో బాలీవుడ్లో భారీ సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. అలాంటి సమయంలో విడుదలైన ‘దురంధర్’ మాత్రం రోజుకో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు రెండింటిలోనూ ప్రేక్షకుల రద్దీ తగ్గకుండా కొనసాగడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
అయితే ధురంధర్‌ని రాజా సాబ్ బ్రేక్ చేస్తుందని అందరు ఆశించారు. కాని పెద్ద దెబ్బ ఎదురైంది. టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌కు బాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో సగటు విజయాలు సాధించిన కొన్ని సినిమాలు కూడా హిందీలో భారీ వసూళ్లు రాబట్టిన సందర్భాలున్నాయి. అయితే జనవరి 9న విడుదలైన ప్రభాస్ చిత్రం ‘ది రాజా సాబ్’ విషయంలో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. హిందీ మార్కెట్లో ఈ సినిమా మూడు రోజుల్లో కలిపి సుమారు రూ.15.75 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విడుదలై 38 రోజులు గడిచిన ‘దురంధర్’ సినిమా, ‘రాజా సాబ్’ మూడో రోజు కలెక్షన్లను కూడా మించక పోవడం. బాలీవుడ్ ట్రేడ్ లెక్కల ప్రకారం, ‘దురంధర్’ తన 38వ రోజునే హిందీలో రూ.6.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ప్రస్తుతం బాలీవుడ్లో రణవీర్ సింగ్‌కు ఉన్న డామినేషన్‌ను స్పష్టంగా సూచిస్తోంది.
జియో స్టూడియోస్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ‘దురంధర్’ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,290 కోట్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లో మాత్రమే 38వ రోజున ఈ చిత్రం సుమారు రూ.6.85 కోట్లు సాధించడం ట్రేడ్‌ను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఇంత కాలం తర్వాత సినిమాల కలెక్షన్లు నామమాత్రంగా మారుతాయి. కానీ ‘దురంధర్’ మాత్రం ఆ ట్రెండ్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది.ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితిని చూస్తే, ‘దురంధర్’ ముందు మరే సినిమా నిలబడలేకపోతోంది. కొత్త విడుదలలు కూడా ఈ సినిమాకు థియేటర్లు ఖాళీ చేయలేక వెనక్కి తగ్గుతున్నాయంటే, రణవీర్ సింగ్ స్టార్డమ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
మొత్తానికి, ఓటీటీలోకి వెళ్లే సమయం దగ్గరపడుతున్నా, థియేటర్లలో మాత్రం ‘దురంధర్’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్‌కు మళ్లీ గట్టి ఊపునిచ్చిన సినిమాగా ఇది చరిత్రలో నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.