Raja Saab 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కామెడీ సినిమాల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, పాన్ ఇండియా స్థాయి మేకింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘ది రాజాసాబ్’ ప్రమోషన్లను మేకర్స్ ప్రారంభించారు. చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, అనుకోకుండా సినిమాకు సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ బయటపెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ‘ది రాజాసాబ్’ ట్రైలర్లో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించిన విషయం గురించి ప్రశ్నించాడు. సాధారణంగా ఐకానిక్ క్యారెక్టర్లను మళ్లీ చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారని, అలాంటిది ప్రభాస్‌ను ఆ లుక్కు ఎలా ఒప్పించారు అని అడిగాడు. దీనికి సమాధానంగా మారుతీ మాట్లాడుతూ, “ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించడానికి పెద్ద కథే ఉంది. ఆ కథ మొత్తం ది రాజాసాబ్ పార్ట్ 2లో ఉంటుంది. ఆ లుక్కు ఉన్న ప్రాధాన్యతను ప్రభాస్‌కు వివరించాను, అప్పుడు ఆయన ఒప్పుకున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటలతో మారుతీ అనుకోకుండా ‘ది రాజాసాబ్’కు సీక్వెల్ కూడా ఉంటుందనే విషయాన్ని బయటపెట్టినట్లైంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలను చూస్తే, సీక్వెల్స్ విషయంలో ఆయన టాప్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సలార్ 2, కల్కి 2 లాంటి భారీ చిత్రాలు లైన్లో ఉండగా, ఇప్పుడు ది రాజాసాబ్ 2 కూడా ఆ జాబితాలో చేరడం ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌లా మారింది. ఈ సీక్వెల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయో, థియేటర్లకు ఎప్పుడు వస్తాయో ఇంకా స్పష్టత లేకపోయినా, ఈ అప్డేట్స్ మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాయి. మొత్తంగా ‘ది రాజాసాబ్’ ఒక్క సినిమాగా మాత్రమే కాకుండా, ఓ ఫ్రాంచైజీగా మారే అవకాశాలు ఉన్నాయన్న మాట ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.