దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘కాంతార చాప్టర్ 1’. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా స్టంట్ కొరియోగ్రాఫర్ అర్జున్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ‘కాంతార చాప్టర్ 1’ గురించీ, నటుడు, దర్శక, నిర్మాత రిషబ్శెట్టి గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘ఇప్పటివరకూ చాలామంది హీరోలతో పనిచేశాను. కానీ రిషబ్శెట్టి లాంటి హీరోని మాత్రం నేను నిజంగా చూడలేదు.
కష్టసాధ్యమైన ఫీట్ చేయాల్సొస్తే.. ఏ హీరో అయినా ‘నా శాయశక్తులా ప్రయత్నిస్తా..’ అంటాడు. కానీ రిషబ్ ‘నేను బతికున్నంత వరకూ చేస్తా..’ అంటాడు. ‘కాంతార చాప్టర్ 1’కోసం ఆయన తీసుకున్న రిస్క్ గురించి మాటల్లో చెప్పలేను. ఇందులో ఒక్క యాక్షన్ సన్నివేశంలో కూడా డూప్ ఉపయోగించలేదు. స్వయంగా రిషబే రిస్క్ చేసి చేశారు. ఇప్పటివరకూ ఆయన కెరీర్లో చేయని యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.
నిజంగా ప్రాణాంతకమైన షాట్స్ అవన్నీ. వాటన్నింటినీ స్వయంగా చేశారు రిషబ్శెట్టి. దీనికోసం ప్రత్యేకంగా కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ప్రాచీన యుద్ధకళగా ప్రాచుర్యం పొందిన కలరిపయట్టులోనూ శిక్షణ తీసుకున్నారు. నిజంగా ఎంతోమంది హీరోలకు స్ఫూర్తి రిషబ్ శెట్టి.’ అంటూ కొనియాడారు అర్జున్ రాజ్.