Rahul Sipligunj | బిగ్ బాస్ సీజన్ 3 విజేత, ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై తెలుగు పాటను నిలబెట్టిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేమికురాలు హరిణి రెడ్డితో ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ కనిపించే రాహుల్ ఈసారి మాత్రం తన నిశ్చితార్థ వేడుకను చాలా ప్రైవేట్‌గా ఉంచారు. ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయిన, వారికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ఫొటోలో రాహుల్, హరిణి రెడ్డి కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీలో రాయల్ లుక్‌లో కనిపించగా, హరిణి ఆరెంజ్ కలర్ లెహంగాను ధరించి తళుక్కుమంది. ఈ జంటని చూసిన వారంతా కూడా చూడముచ్చటగా ఉందంటున్నారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. హరిణి రెడ్డి గురించి ఇంకా పూర్తి సమాచారం లేనప్పటికీ, ఆమె కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగానే భావిస్తున్నారు. హరిణి రెడ్డి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రైవేట్‌గా ఉన్నప్పటికీ, ఆమెకు 15.6K మంది ఫాలోవర్స్ ఉన్నారు.
యాంకర్ విష్ణుప్రియ, సింగర్ నోయల్, స్రవంతి చొక్కారపు, గీతా మాధురి, అరియానా, సన్నీ, జబర్దస్త్ రోహిణి, కరుణ భూషణ్ వంటి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ శుభవార్త బయటకు వచ్చాక, రాహుల్ అభిమానులు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్.. అషూ రెడ్డితో ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు వాటన్నింటికి పులిస్టాప్ పడింది. ఇక రాహుల్ ప్రస్తుతం సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘మఠిపాలే’, ‘బోనాలే’, ‘పెడవలే పడితేనా’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘నాటు నాటు’ వంటి ఎన్నో హిట్ సాంగ్స్‌తో యువతను అలరిస్తూ వస్తున్నాడు. పర్సనల్ లైఫ్‌లో కూడా గుడ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు.