Puri Jagannadh | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరిసేతుపతి అంటూ ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి టబు ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ వార్తలపై స్పందించింది రాధికా ఆప్టే. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఈ సినిమాలో భాగమైనట్లు తనకే తెలియదని రాధికా ఆప్టే సరదాగా చెప్పారు. ఇలాంటి ఊహాగానాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తాయని, ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయని వెల్లడించారు.
దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని సమాచారం.