R Subbalakshmi | ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి (87) నవంబర్ 30న కొచ్చిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బలక్ష్మి గురువారం సాయంత్రం మృతి చెందినట్టు ఆమె మనవరాలు సౌభాగ్య తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఇక సుబ్బలక్ష్మి మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు.
అయితే తాజాగా తన మనవరాలు సౌభాగ్య సుబ్బలక్ష్మి అమ్మమ్మతో గడిపిన చివరి క్షణాలను వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తే.. ఎనిమిది నెలల క్రితం నుంచి చనిపోయే 15 రోజుల క్రితం వరకు సుబ్బలక్ష్మితో గడిపిన క్షణాలు వీడియోలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు, తమిళ, మలయాళంతో పాటు బాలీవుడ్లో దాదాపు 75 సినిమాలలో సుబ్బలక్ష్మి నటించారు. ఇక ఆమె చివరిసారిగా దళపతి విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’ సినిమాలో కనిపించారు. మలయాళ చిత్రసీమలో చేసిన అమ్మమ్మ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. తెలుగులోనూ ఆమె కల్యాణ రాముడు, ఏ మాయ చేశావే సినిమాల్లో కనిపించింది.
వృత్తిపరంగా సంగీత విద్వాంసురాలు, నృత్య కళాకారిణి అయిన సుబ్బలక్ష్మి చిన్నతనం నుంచే కళలలో చురుకుగా ఉండేవారు. ఇక 1951లో ఆల్ ఇండియా రేడియో ద్వారా కళాత్మక జీవితాన్ని ప్రారంభించారు. ఇక రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ సుబ్బలక్ష్మి పనిచేశారు.