స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్ర లో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘యూనివర్సిటీ’. విద్యా వ్యవస్థ లోపాలను ప్రశ్నిస్తూ ఈ సినిమా తెరకెక్కుతున్నది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ… విద్యా వ్యవస్థ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాను. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను పరీక్షలు రాయకుండా అడ్డుకుంటున్నాయి. వారి భవిష్యత్తో ఆటలు ఆడుకుంటున్నాయి. మన దేశంలో విద్యారంగం బాగుపడాలి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వమే నిర్వహించాల్సిన సేవా రంగంలోని విద్య, వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఎన్నికల ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. అలాగే ఒక్కో పభుత్వ సంస్థను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోవాలి. విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి ’అని అన్నారు.