ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్,రష్మిక ప్రధాన పాత్రలలలో రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ముత్తం శెట్టి మీడియా తో కలిసి నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన నటిస్తుండగా, ఈ చిత్రం లో ప్రతినాయకుడి పాత్ర లో ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ నటిస్తున్నారు.
ఆ మధ్య చిత్రం నుండి ఇంట్రడక్షన్ వీడియో ఒకటి విడుదల చేయగా, ఇది కేక పెట్టించింది. ‘తగ్గేదే ల్యా’ అంటూ ఊర మాస్ గెటప్‌లో సర్ ప్రైజ్ చేశాడు అల్లు అర్జున్.పుష్పరాజ్ ని పరిచయం చేస్తూ 1.21 నిమిషాల నిడివితో విడుదలైన ఈ టీజర్ తెలుగు ఇండస్ట్రీలోనే 70 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతూ.. తొలి ఇంట్రడక్షన్ వీడియోగా తెలుగు సినీ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. టీజర్‌తోనే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు.
ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కానుంది. అయిదు బాషల్లో ఈ ఫస్ట్ సింగిల్ విడుదల కి ప్లాన్ చేయగా, దాక్కొ డాక్కో మేక అంటూ తెలుగు లో వస్తుండగా, హిందీ లో జాగో జాగో బక్రే అంటూ రానుంది. హిందీలో పాట పాడిన విశాల్ దడ్లాని తన ట్విట్టర్లో అల్లు అర్జున్ మరియు దేవీ శ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ లో వస్తున్న పుష్ప చిత్రం లోని జాగో జాగో బక్రే రికార్డ్స్ సెట్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పాట పై మరిన్ని అంచనాలు పెరిగాయి. హిందీ లో ఈ పాట కి రాజీవ్ ఆలం లిరిక్స్ రాయగా, ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు.