Pushpa-2 Teaser | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప ది రైజ్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే రూ.100 కోట్ల నెట్ సాధించి అక్కడి విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.
ఆగస్టులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. పుష్ప అనుకున్న దానికంటే ఎక్కువ హిట్టవడంతో సుకుమార్ పార్ట్-2పై మరింత ఫోకస్‌ను పెట్టాడట. ఈ క్రమంలో పుష్ప-2 పై హైప్ పెంచేందుకు టీజర్‌ను ప్లాన్ చేశాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను చిత్రీకరించాడట. తాజాగా ఈ టీజర్‌లోని డైలాగ్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ‘అడివిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం’ అంటూ ఓ మాస్ డైలాగ్ ఉండనుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు గానీ ఈ డైలాగ్ బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. సినిమాపై హైప్ తీసుకురావడానికి టీజర్‌ను ‘అవతార్-2’ థియేటర్లలో స్క్రీనింగ్ చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.