Pushpa 2 | భారతీయ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ సునామీ సృష్టిస్తున్నాడు. విడుదల రోజు నుంచే రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ‘పుష్ప-2’ చిత్రం వెయ్యికోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుంది. కేవలం ఆరురోజుల్లో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప-2’ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర సాగిస్తున్నది.
ఈ సినిమా ఆరు రోజుల్లో 1002కోట్ల కలెక్షన్స్ సాధించిందని బుధవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఆరు రోజుల్లోనే 375 కోట్లు వసూలు చేసిందని, బాలీవుడ్లోనే ఇదొక రికార్డని నిర్మాణ సంస్థ పేర్కొంది. రాబోవు రోజుల్లో ఈ సినిమా మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని చిత్ర బృందం పేర్కొంది.