బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ వసూళ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. దీంతో ఈ సినిమా ‘బాహుబలి-2’ ను (1810 కోట్లు) అధిగమించింది. 32 రోజుల్లో ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రమిదేనని, ఇది ఆల్టైమ్ రికార్డని మేకర్స్ తెలిపారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప-2’ ప్రీమియర్ షోస్ నుంచే వసూళ్లలో రికార్డుల మోతమోగించింది. దక్షిణాదితో పాటు ఉత్తర భారతదేశంలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విదేశాల్లో కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటలు ఈ మాస్ ఎంటర్టైనర్ విజయంలో కీలక భూమిక పోషించాయి.