భార్యాభర్తల కీచులాటల నేపథ్యంతో సాగే వినోదభరిత చిత్రం ‘పురుషః’. పవన్‌కల్యాణ్ బత్తుల కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉన్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా థీమ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు..’ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా, శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ పాటను ఆలపించడం విశేషం. మగాళ్ల పరిస్థితిపై సానుభూతి కలిగేలా ఈ పాట సాహిత్యం ఆద్యంతం సాగింది. ఈ సినిమా కథను కూడా ఈ పాట ఆవిష్కరిస్తున్నది. వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, సప్తగిరి, వి.టి.వి.గణేష్, కసిరెడ్డి రాజకుమార్, విషిక తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, నిర్మాణం: కళ్యాణ్ ప్రొడక్షన్స్.