పురుష ప్రేతమ్
సోనీ లివ్: 24 మార్చి
దర్శకత్వం: కృష్ణానంద్
లోడ్ చేసిన గన్లా ఉన్నవాడే నిజమైన పోలీస్. డమ్మీ బుల్లెట్లు లోడ్ చేసుకొని బిల్డప్ ఇచ్చే ఓ పోలీస్ కథే పురుష ప్రేతమ్! గోరంతలు కొండంతలు చేసి చెప్పడంలో పోలీస్ అధికారి సెబాస్టియన్‌ది అందెవేసిన చేయి. ఒకరోజు ఊరి చివరన చెరువులో ఒక మృతదేహం కనిపిస్తుంది. ఆ కేసు పరిశోధన బాధ్యత సెబాస్టియన్‌కు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. మృతుడి తాలూకు ఎవరో తెలియకపోవడంతో, పోలీసులే ఖననం చేస్తారు. కొన్నాళ్లకు ఒక మహిళ తన భర్త కనిపించకుండా పోయాడనీ, ఆ మృతుడు తన భర్తే అయి ఉంటాడని పోలీసులను సంప్రదిస్తుంది. అసలు ఆ మహిళ ఎవరు, మృతుడికి ఆమెకు సంబంధం ఏమిటి? ఈ కేసును సెబాస్టియన్ ఎలా పరిష్కరించాడు అన్నది మిగిలిన కథ. సినిమా చివర్లో ట్విస్ట్ ఆశ్చర్యం కలిగిస్తుంది. నిదానంగా సాగే కథ అక్కడక్కడా విసుగు తెప్పిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు హాస్యం జతచేసి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణానంద్. ఈ మలయాళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. సినిమాలో అందరూ పరిచయం లేని నటులే కావడంతో, కథతో ప్రయాణించడం కొంత ఆలస్యం అవుతుంది.