Puri Musings | టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లండన్ టూ కలకత్తా బస్సు ప్రయాణం గురించి ఈ పాడ్ కాస్ట్లో మాట్లాడాడు పూరి. లండన్ టూ కలకత్తా బస్సు ప్రయాణం గురించి ఎప్పుడైన విన్నారా. ఇది 1957లో ప్రారంభమయ్యింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్సు మార్గంగా ఒకప్పుడు గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు.
ఆల్బర్ట్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ బస్సు సర్వీస్‌ను మొదలుపెట్టింది. ఈ ప్రయాణం దాదాపు 20 వేల మైళ్లు అంటే 32,700 కిలోమీటర్లు ఉండేది. లండన్ నుంచి కోల్‌కతా చేరుకోవడానికి అప్పట్లో సుమారు 50 రోజులు పట్టేది. ఈ బస్సు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆసియా, టర్కీ, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ఇండియాకు వచ్చేది. ఈ మార్గాన్ని హిప్పీ రూట్ అని పిలిచేవారని పూరి చెప్పారు. 1957లో ఒక్కసారి ప్రయాణించడానికి టికెట్ ధర 85 డాలర్లు ఉండేది. ఈ బస్సు తన తొలి ప్రయాణాన్ని 1957 ఏప్రిల్ 15న లండన్‌లో మొదలుపెట్టి జూన్ 5న కోల్‌కతా చేరుకుందని ఆయన వివరించారు.
ఈ బస్సు ఒక తిరిగే హోటల్‌లా ఉండేదని పూరి తెలిపారు. ఇందులో నిద్రించడానికి సదుపాయం, చిన్న కిచెన్, లైబ్రరీ వంటి వసతులు అన్నీ ఉండేవి. ప్రయాణికులకు ఆహారం కూడా బస్సులోనే అందించేవారు. రెండు నెలల ఈ ప్రయాణం ఒక అందమైన టూర్లా ఉండేదని, బెనారస్, తాజ్‌మహల్ వంటి ప్రదేశాలను చూసుకుంటూ వెళ్లవచ్చని ఆయన అన్నారు. హిప్పీలు, ప్రేమలో విఫలమైన వారు ఎక్కువగా ఈ ప్రయాణం చేసేవారని, బోర్డర్ చెక్ పాయింట్ల వద్ద పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదని, కానీ ఇరాన్, కాబూల్‌లో కొద్దిగా సమస్యలు ఎదురయ్యేవని ఆయన గుర్తు చేశారు.
వయసులో ఉన్నవారే ఎక్కువగా ఈ ప్రయాణంలో పాల్గొనేవారని, అందువల్ల ప్రయాణం చాలా సరదాగా సాగేదని పూరి చెప్పారు. ఇష్టమైన ఆహారం తింటూ, తమకు నచ్చినట్టు జీవిస్తూ రెండు నెలల పాటు ఈ ప్రయాణాన్ని ఆస్వాదించేవారని ఆయన అన్నారు. కొంతమంది మధ్యలో ఏదో ఒక దేశంలో బస్సు ఎక్కేవారని, మరికొందరు మధ్యలోనే దిగి వెళ్లిపోయేవారని ఆయన తెలిపారు. ఒక బ్రిటిష్ వ్యక్తి ఆరు దేశాల్లో ఆరుగురు అమ్మాయిలతో ప్రేమలో పడి చివరకు ఏడుస్తూ కోల్‌కతా చేరుకున్నాడని, ఒక కోతి ఒకరి పాస్‌పోర్ట్ ఎత్తుకుపోయిందని ఇలాంటి ఎన్నో కథలు ఈ బస్సు చరిత్రలో ఉన్నాయని ఆయన నవ్వుతూ చెప్పారు. ఇందులో ప్రయాణించిన పీటర్ మోస్ అనే వ్యక్తి ‘ది ఇండియా మ్యాన్’ అనే పుస్తకం కూడా రాశాడని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో లండన్‌లో ఇది ఒక ప్రత్యేకమైన బస్సు అని ఆయన అన్నారు.
ఈ బస్సు సర్వీస్ 1979 వరకు కొనసాగిందని, ఆ తర్వాత ఇరాన్ విప్లవం మరియు అఫ్గానిస్తాన్-సోవియట్ల మధ్య యుద్ధాల కారణంగా నిలిచిపోయిందని పూరి విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇలాంటి బస్సు సర్వీస్ ఉంటే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి సర్వీస్‌ను ప్రారంభిస్తారేమో చూద్దామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.