My baby movie | తమిళంలో ఘన విజయం సాధించిన “డీఎన్ఏ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి “మై బేబి” పేరుతో తెలుగు ప్రేక్షకులకు తీసుకురాబోతున్నారు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమిళ నటుడు అధర్వ్, మలయాళ నటి నిమిషా సాజయాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, జూలై 18న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఎస్ కే పిక్చర్స్, యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు. దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి. సాయిచరణ్ తేజ సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా “మై బేబి” చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, “తమిళ వెర్షన్ ‘డీఎన్ఏ’ చూసిన తర్వాత ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తీసుకురావాలని బలంగా అనిపించింది. వాళ్ళు మొదట అధిక ధర చెప్పారు, కానీ గతంలో నేను నిర్మించిన చిత్రాల విజయాలను వివరించడంతో, నాపై నమ్మకంతో ఈ సినిమా హక్కులను మా సంస్థకు ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాణంలో యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుండి సాయిచరణ్ గారు నాకు తోడయ్యారు,” అని తెలిపారు.
నిన్న వేసిన ప్రీమియర్ షోకు మురళీ మోహన్ లాంటి సీనియర్ నటులు హాజరై కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో అర్థమైంది. అన్ని ఏరియాల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది. నేను నిర్మించిన చిత్రాల్లోకెల్లా ‘మై బేబి’ అత్యధిక థియేటర్లలో, దాదాపు 350 స్క్రీన్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది. నైజాంలో 130కి పైగా స్క్రీన్లలో విడుదలవుతోంది. నా సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది,” అని సురేష్ కొండేటి వివరించారు.
ఈ సినిమా మంచి మదర్ సెంటిమెంట్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. ఐదు అద్భుతమైన ఫైట్స్ ఉన్నాయి. ‘డీఎన్ఏ’ అనే టైటిల్ తెలుగు ప్రేక్షకులకు అంతగా రీచ్ కాదనిపించి, ‘మై బేబి’ అనే టైటిల్ పెట్టాము. ఈ టైటిల్ గురించి చెప్పినప్పుడు ఒరిజినల్ మూవీ నిర్మాతలు కూడా ‘మేము ఈ టైటిల్ పెట్టి ఉంటే మా సినిమా మరింత పెద్ద విజయం సాధించేది’ అని అన్నారు. ‘మై బేబి’ ట్రైలర్ లాంచ్‌కు విచ్చేసిన భరద్వాజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఎంత బిజీగా ఉన్నా మా కోసం వచ్చారు. ‘మై బేబి’ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నాను,” అని సురేష్ కొండేటి పేర్కొన్నారు.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “సురేష్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించారు. అప్పట్లో ఓటీటీలు లేనప్పుడు, ఇతర భాషల సినిమాలు చూడాలంటే డబ్బింగ్ సినిమాలే ఆధారం. అలా సురేష్ కొండేటి చేసిన చిత్రాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ‘మై బేబి’ సినిమా కూడా ప్రీమియర్ షోల నుంచే అద్భుతమైన టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ట్రైలర్ చూస్తే ఇది బలమైన కథాంశం ఉన్న చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది, సురేష్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.
సహ-నిర్మాత సాయిచరణ్ తేజ మాట్లాడుతూ, “మంచి సినిమాలు నిర్మించాలనే ప్రయత్నంలో సురేష్ కొండేటి గారు పరిచయమయ్యారు. ఆయన తీర్పును మేము నమ్ముతున్నాం. ‘మై బేబి’ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. ఇకపై కూడా సురేష్‌తో కలిసి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ‘మై బేబి’ మా సంస్థకు తొలి సినిమా. ఈ ప్రయత్నంలో మీరంతా మద్దతు అందించి విజయం సాధించేలా చేస్తారని ఆశిస్తున్నాం,” అని పేర్కొన్నారు.