Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మరి చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో హరిహరవీరమల్లు, ఓజీ దాదాపు పూర్తకావచ్చాయి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చాలా షూటింగ్ చేయాల్సివుంది. ఓవైపు వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారా.. అని అభిమానులు ఎదురు చూస్తుంటే.. మరోవైపు పవన్‌కల్యాణ్ నాలుగో సినిమాకు సంబంధించిన అప్డేట్ రీసెంట్గా వెలుగు చూసింది.
వివరాల్లోకెళ్తే.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని గతంలో అనౌన్స్ చేశారు. మూడేళ్ల క్రితం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత చడీచప్పుడూలేదు. ఆదివారం విశ్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమా ప్రెస్‌మీట్‌కి విచ్చేసిన నిర్మాత రామ్ తాళ్లూరిని పవన్ సినిమా గురించి విలేకరులు ప్రశ్నించగా, ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇప్పుడేదీ మన చేతుల్లో లేదు. మాసైడ్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ కూడా లాక్ చేశాం. పూజా కార్యక్రమం కూడా ముగించాం. రీసెంట్గా ఆయన్ని కలిశా. ‘వీలు చూసుకొని సినిమా చేయొచ్చు..’ అన్నారు. ఇక అంతా ఆయన చేతిల్లోనే ఉంది. ఆయన ఎప్పుడంటే అప్పుడే..’ అంటూ చెప్పుకొచ్చారు రామ్ తాళ్లూరి.