Producer Ravi Shankar | సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఏఐ దుర్వినియోగంపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రముఖ నిర్మాత రవిశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘హనుమాన్ అంశ్’ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీతో వస్తున్న ఫేక్ వీడియోల వల్ల నేటి యువత ఆలోచనా విధానం కలుషితమవుతోందని మండిపడ్డారు. జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వివాదంపై స్పందిస్తూ.. టెక్నాలజీని తప్పుదోవ పట్టించి మహిళలను వేధించడం చాలా హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి సమయంలో సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో దైవభక్తిని పెంపొందించడానికి ‘హనుమాన్ అంశ్’ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్లు వసూలు చేయడం నిజంగా అద్భుతమని, భారీ బడ్జెట్ సినిమాలకు ఇది చెంపపెట్టు లాంటిదని రవిశంకర్ ప్రశంసించారు. నీమ్ కరోలి బాబా స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, మంచి సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నైజాంలో అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
కాగా, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన జాన్వీ కపూర్ ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లె’ పాటను పోలి ఉన్న ఒక అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందిస్తూ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాన్వీ కపూర్ సైతం ఇది మహిళలపై జరుగుతున్న నేరపూరిత దాడితో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూ తదితర ప్రముఖులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు.