‘సందర్భాన్ని బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. సైలెంట్‌గా ఉండే వ్యక్తిని వైలెంట్‌గా మార్చేది సందర్భమే. ఈ కథలో అలాంటి సిట్యుయేషనే ఉంటుంది. ఓ మామూలు కుర్రాడి జీవితంలో ఎదురైన సంఘటనలు అతడ్ని ఎలా మార్చాయి? అనేదే ఈ సినిమా కథ.’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ అన్నారు. రాజ్‌తరుణ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘తిరగబడరాసామీ’. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాల్కాపురం శివకుమార్ విలేకరులతో ముచ్చటించారు.
‘భార్యాభర్తలు మూడుముళ్ల బంధానికి ఏ విధంగా కట్టుబడి ఉండాలో చెప్పే చిత్రమిది. రవికుమార్‌చౌదరి కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా. చెప్పినదానికంటే బాగా తీశాడు. రాజ్‌తరుణ్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది. తగ్గట్టే అద్భుతంగా నటించాడు. అలాగే మన్నారా చోప్రా నెగిటీవ్ షేడ్స్ ఉండే కేరక్టర్‌ని చాలాబాగా చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం మా సొంత ప్రాంతమైన జహీరాబాద్‌లో చేశాం. ప్రతిరోజూ షూటింగ్‌కి వందలమంది వస్తుండేవారు.
చాలా సరదాగా ఈ షూటింగ్ జరిగింది’ అని తెలిపారు శివకుమార్. దివంగత నటుడు శ్రీహరి పోద్బలంతో ‘భద్రాద్రి’ సినిమాతో నిర్మాతనయ్యానని, ఆ సినిమాతోనే ఇప్పటి మెగా దర్శకుడైన కె.ఎస్.రవీంద్ర(బాబీ)ని రైటర్‌గా పరిచయం చేశానని, ఇంకా కార్తీక్ ఘట్టమనేనిని కూడా తానే పరిచయం చేశానని, ఈ సినిమా ద్వారా మాల్వి మల్హోత్రా హీరోయిన్గా పరిచయం అవుతున్నదని, తన ప్రతి సినిమా ద్వారా కొత్తవారిని పరిచయం చేయడం తనకిష్టమని శివకుమార్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా చేస్తున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్‌గారి ఆశీర్వాదంతో ఈ బాధ్యత స్వీకరించా. ఇంకా నా పదవీకాలం 8 నెలలు ఉంది. కొందరిలాగా పార్టీలు మారే తత్వం కాదు నాది. కేసీఆర్సార్తో నా బంధం ఈనాటిది కాదు. ఆయన టీడీపీలో ఉన్నప్పట్నుంచీ ఆయనతో నడిచినవాడ్ని. ఎప్పటికీ ఆయనతోనే నడుస్తా.