ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. దివ్య భావన దర్శకురాలిగా పరిచయమవుతున్నది. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలు. జూలై 7న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు. దర్శకురాలు దివ్య భావన చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తొలి ప్రేమ తాలూకు భావోద్వేగాల నేపథ్యంలో నడిచే కథ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది’ అని చెప్పింది. ‘నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించే అందమైన ప్రేమకథ ఇది. యువతరం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని కథానాయిక మిస్తీ చక్రవర్తి తెలిపింది. ప్రేమకథా చిత్రాల్లో ఓ విభిన్న నేపథ్యంలో ఆకట్టుకుంటుందని నిర్మాత సుభాష్ పేర్కొన్నారు.