శతాధిక చిత్రాల దర్శకుడిగా అసమానమైన ప్రతిభాపాటవాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు దివంగత దిగ్దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన పెద్ద కుమార్తె కోడి దివ్య సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ.. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. నేడు నిర్మాత కోడి దివ్య జన్మదినం. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆమె పంచుకున్న విశేషాలు..
నాన్నగారిలా నేను కూడా దర్శకత్వం వైపు వెళ్లాలనుకున్నా. అప్పటికే కొంచెం అలస్యం అయిందనే భావనతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నా. దర్శకత్వం అంటే ఎంతో బాధ్యతతో వ్యవహరించాలి. సరైన ప్రణాళిక లేకుండా వెళితే నాన్నగారి పేరు చెడగొట్టినట్లు అవుతుందనిపించింది. అయితే నాకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. అందుకే సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాను. దర్శకుడిగానే కాకుండా చిత్ర నిర్మాణంపై కూడా నాన్నగారికి చాలా అవగాహన ఉండేది. ఎక్కడా రూపాయి వృథా లేకుండా ఖర్చు చేసే ప్రతి పైసా తెరపై కనిపించాలని చెప్పేవారు. ఆయన మాటల్ని పాటిస్తూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాను.
సస్పెన్స్ ఎలిమెంట్‌తో..
‘రాజావారు రాణిగారు’ కంటే ముందే కిరణ్ అబ్బవరంతో సినిమా చేయాల్సి ఉంది. అ సమయంలో నాన్నగారు అనారోగ్యానికి గురవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ‘నేను మీకు కావాల్సినవాడిని’ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుంది. ఓ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో చిత్రీకరణ జరుగుతున్నది. త్వరలో షూటింగ్ పూర్తిచేస్తాం. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా చక్కటి నాణ్యతతో సినిమాను తెరకెక్కిస్తున్నాం. మణిశర్మగారు తనదైన శైలిలో మంచి పాటలిచ్చారు. ఈ నెల 10న పాలకొల్లులో టీజర్ రిలీజ్ చేస్తున్నాం.
కొత్తదనానికే పెద్ద పీట
నాకు స్వతహాగా వినోదప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టం. నాకు నచ్చిన పాయింట్స్‌ను నోట్ చేసుకొని కథా రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటాను. నాన్నగారు గ్రాఫిక్స్ ప్రధానంగా ఎన్నో అద్భుత చిత్రాల్ని రూపొందించారు. నాకూ ఆ తరహా సినిమాలు చేయాలనుంది. కేవలం గ్రాఫిక్స్ కోసమని కాకుండా కథ డిమాండ్ చేస్తేనే వీఎఫ్ఎక్స్ గురించి ఆలోచించాలన్నది నా అభిప్రాయం. గ్రాఫిక్స్ ప్రధానమైన మంచి కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తాను. నా అభిరుచిని ప్రతిబింబిస్తూ ఉత్తమ కథా చిత్రాలకు రూపకల్పన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. కథల్లో కొత్తదనానికే పెద్దపీట వేస్తాను. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా సినిమాలు చేయాలని ఉంది.సినిమాలు చేయాలని ఉంది.