సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత రాజ్ కందుకూరి, సోహెల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు విఘ్నేష్ మాట్లాడుతూ ‘ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమా తీశా. అందమైన గోదారి నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ టైటిల్ తనకు ఎంతగానో నచ్చిందని, మార్కండేయ సంగీతం బాగుందని నిర్మాత రాజ్ కందుకూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.