హాలీవుడ్లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా.. భారతీయ సినిమాలు అరాకొరా మాత్రమే చేస్తున్నది. ఎస్.ఎస్.రాజమౌళి, మహేష్‌బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ‘SSMB29’, హృతిక్‌రోషన్ దర్శకత్వంలో రూపొందనున్న ‘క్రిష్ 4’.. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఇండియన్ మూవీస్ ఈ రెండే. ముఖ్యంగా రాజమౌళి సినిమాలో నటిస్తుండటంతో ఆమెకు సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నది. రీసెంట్గా ఓ ఆంగ్ల పత్రికకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూని మహేష్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తాను ఓ ప్రస్టేజియస్ ఇండియన్ మూవీలో నటిస్తున్నట్లు, ఆ ప్రాజెక్ట్ కోసం తానెంతో ఎదురుచూస్తున్నట్టు ఆమె ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను ఇండియాను, హిందీ సినిమాలను మిస్ అవుతున్నాను. ఈ ఏడాది ఒక భారతీయ సినిమాకు సైన్ చేశాను.
ఆ సినిమా నాకెంతో ప్రత్యేకం.’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ప్రియాంక. మణిరత్నం ‘బొంబాయి’ సినిమాను ఆమె గుర్తుచేసుకుంటూ ‘నేను సినీనటినే కానీ, సినిమాలు చూస్తూ పెరిగిన నటిని కాదు. జీవితంలో చాలా తక్కువ సినిమాలు చూశా. మా నాన్నకు సంగీతం అంటే ఇష్టం. అందుకే ఇంట్లో ఎప్పుడూ ఏదోఒక సంగీతం వినిపిస్తూవుండేది. నాకు 13ఏండ్ల వయసులో ముంబయ్‌లోని ఓ థియేటర్లో మణిరత్నం ‘బొంబాయి’ సినిమా చూశాను. ఊహ తెలిశాక నేను చూసిన తొలి సినిమా అదే. ఆ అనుభవం జీవితంలో మరిచిపోలేను. ఇప్పటికీ ‘బొంబాయి’ సినిమా చూస్తే ఏదో తెలీని ఫీలింగ్.’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.