Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితం, వివాహ బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ముఖ్యంగా భర్త నిక్ జోనాస్‌తో విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. ఈ రూమర్లు నిరాధారమైనవని, తమ మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం మరింత బలంగా ఉందని స్పష్టం చేశారు. దేశం, మతం, వయసు వంటి భేదాల కారణంగానే కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని అన్నారు. “మేము ఎనిమిదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నాం. కేవలం ఆరు నెలల పరిచయంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ, నిక్లో ఉన్న నిజాయతీ, పరస్పర గౌరవం మా బంధాన్ని మరింత బలపరిచాయి అని ఆమె తెలిపారు. ఇతరుల అభిప్రాయాలు తమ నిర్ణయాలను ప్రభావితం చేయవని ఆమె తేల్చి చెప్పారు.
ఇక కుటుంబ విషయానికి వస్తే, తన కుమార్తె మాల్తీ మేరీ ప్రైవసీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ప్రియాంక వెల్లడించారు. సెలబ్రిటీగా బయటకు వెళ్లినప్పుడు అనుమతి లేకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం తనకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. “నాతో మాట్లాడేవారిని గౌరవిస్తాను, కానీ ప్రైవసీకి భంగం కలిగించడం అంగీకరించను. అందుకే నా కుమార్తె భద్రత కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాను” అని వివరించారు. వృత్తిపరంగా కూడా ప్రియాంక తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్లో అగ్ర నటిగా ఎదిగిన తర్వాత, 30 ఏళ్ల వయసులో అన్నిటిని వదిలి హాలీవుడ్లో అడుగుపెట్టడం తన జీవితంలో పెద్ద సాహసం అని చెప్పారు. ప్రారంభంలో మూస పాత్రలు వచ్చినప్పటికీ, పట్టుదలతో ముందుకు సాగి ఇప్పుడు తనకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్థాయికి చేరుకున్నానని ఆమె తెలిపారు.
నిజమైన విజయం అంటే మనకు ఇష్టమైన పని చేస్తూ కుటుంబంతో సమయం గడపడం అని ప్రియాంక అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ కొత్త సవాళ్లను స్వీకరించడమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆమె అభిమానుల నుంచి విస్తృత మద్దతు పొందుతున్నాయి.