Prime MX Player OTT | భారతీయ ఓటీటీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో తన అనుబంధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ MX Playerను పూర్తిగా తనలో విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ ప్రేక్షకులకు భారీ స్థాయిలో వినోద కంటెంట్ ఒకే వేదికపై అందుబాటులోకి రానుంది.రెండేళ్ల క్రితం ఎంఎక్స్ ప్లేయర్ ఆస్తులను అమెజాన్ సొంతం చేసుకున్నప్పటి నుంచే ఈ విలీన ప్రక్రియకు పునాది పడింది. తాజాగా మే 7న ఈ విలీనాన్ని అధికారికంగా ధృవీకరించడంతో ఓటీటీ రంగంలో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు విడివిడిగా పనిచేసిన ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ ఇకపై ఒకే ప్లాట్‌ఫామ్ కింద సేవలు అందించనున్నాయి.
ఈ విలీనంతో సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్రీమియం కంటెంట్‌తో పాటు ప్రకటనలతో కూడిన ఉచిత కంటెంట్ కూడా ప్రేక్షకులకు ఒకే యాప్‌లో లభించనుంది. భారతదేశంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “వన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్”గా ప్రైమ్ వీడియోను తీర్చిదిద్దాలని అమెజాన్ భావిస్తోంది. ఈ విలీనంపై స్పందించిన ప్రైమ్ వీడియో ఆసియా-పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ.. “ప్రేక్షకులకు వైవిధ్యమైన, వాస్తవికమైన కథలను అందించడమే మా లక్ష్యం. ఎంఎక్స్ ప్లేయర్ భారీ కంటెంట్ లైబ్రరీ, విశాలమైన యూజర్ బేస్ ఇప్పుడు ప్రైమ్ వీడియోతో కలవడం మా సేవలను మరింత బలోపేతం చేస్తుంది” అని తెలిపారు.
ప్రారంభంలో కేవలం వీడియో ప్లేయర్ యాప్‌గా ఉన్న Amazon MX Player తరువాత ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టి భారీ స్థాయిలో ఎదిగింది. ముఖ్యంగా ఉచిత వెబ్ సిరీస్‌లు, మైక్రో డ్రామాలు, ప్రాంతీయ కంటెంట్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించింది. ఆశ్రమ్, భౌకాల్, రసభరి వంటి ఒరిజినల్ సిరీస్‌లు ఈ ప్లాట్‌ఫామ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.ముఖ్యంగా బాబీ డియోల్ నటించిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా భారీ ఆదరణ పొందింది. ఈ విజయాలతో ఎంఎక్స్ ప్లేయర్ భారత డిజిటల్ వినోద రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.ఇప్పుడు ఈ విలీనంతో వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు లభించనున్నాయి. సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్రీమియం కంటెంట్ (SVOD), ప్రకటనలతో కూడిన ఉచిత కంటెంట్ (AVOD), అద్దె ప్రాతిపదికన చూసే సినిమాలు (TVOD) అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ సభ్యులు ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించే అవకాశం పొందుతారు. అదే సమయంలో ఉచిత వినియోగదారులు కూడా ఎంఎక్స్ ప్లేయర్లో లభించే ఫ్రీ కంటెంట్‌ను ప్రైమ్ వీడియోలో ప్రత్యేక విభాగం ద్వారా వీక్షించగలుగుతారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఎంఎక్స్ ప్లేయర్ యాప్‌లోనే ప్రైమ్ వీడియో ఇంటర్ఫేస్ అందుబాటులోకి రానుంది. అయితే లోకల్ వీడియో ప్లేయర్ ఫీచర్లు మాత్రం కొనసాగుతాయని తెలుస్తోంది. ఇక ఐఓఎస్, వెబ్, స్మార్ట్ టీవీ వినియోగదారులు నేరుగా ప్రైమ్ వీడియో యాప్‌కు రీడైరెక్ట్ కానున్నారు.ఈ భారీ విలీనంతో భారత ఓటీటీ రంగంలో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.