Preity Zinta | నటి ప్రీతి జింటా అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఓ అభిమాని ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. దాంతో ఆమె క్షమాపణ చెప్పక తప్పలేదు. వివరాల్లోకెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రీతి.. ఎక్స్ వేదికగా ఇటీవల అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. ‘హిందుత్వంపై మీ అభిమానం చూస్తుంటే మీరు భాజపాలో చేరతారేమో అనిపిస్తుంది? రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అనడిగాడు. ఈ ప్రశ్న వినగానే ప్రీతి జింటా అసహనానికి లోనయ్యారు. కాస్త కఠినంగానే జవాబిచ్చారు.
‘దేవాలయాలకూ, కుంభమేళాలకు వెళ్తే భాజాపాలో చేరినట్టేనా? అంటే నా సంస్కృతినీ నా ధర్మాన్ని గౌరవించడం కూడా నేరమేనా? ఈ సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ ఇక్కడ జడ్జ్ చేసేవారే.’ అంటూ ఘాటు స్పందించారు ప్రీతి జింటా. అయితే.. నెట్టింట ఆమె ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న ప్రశ్నకు ఇంత కఠినంగా జవాబివ్వాలా? అంటూ కొందరు ఎదురు ప్రశ్నించారు. దాంతో సదరు అభిమానికి ప్రీతి క్షమాపణలు చెప్పక తప్పలేదు. ‘క్షమించండి.. నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నా. నా పిల్లలు భారతీయతనూ, మన సంప్రదాయాన్నీ, ధర్మాన్నీ మరచిపోకూడదనే తరచూ వాళ్లను దేవాలయాలకు తీసుకెళ్తుంటా. దురదృష్టవశత్తూ దాన్ని కూడా వేరేలా అర్థం చేసుకుంటున్నారు. రాజకీయం చేస్తున్నారు. అందుకే అలా మాట్లాడా.’ అంటూ వివరణ ఇచ్చారు ప్రీతి జింటా.