Salaar Review | ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్స్ లో ప్రభాస్ (Prabhas) ఒకరు. కెజీఎఫ్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ వచ్చింది. వీరిద్దరి కలయికలో సినిమా అన్నప్పుడు సహజంగానే అంచనాలు వుంటాయి. అయితే ‘సలార్’ Salaar Part-1 Ceasefireపై ఊహించిన దానికంటే ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఏమీ జరగలేదు. కనీసం ఫ్యాన్స్ కోసం ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. అయినప్పటికీ ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. కొన్ని చోట్ల సర్వర్లు డౌన్ అయిపోయినంత రేంజ్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరిగాయి. ఇదంతా ప్రభాస్- ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ మ్యాజిక్. మరి ఇన్ని అంచనాలతో వచ్చిన సలార్ ప్రేక్షకులని ఎలా అలరించింది? ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా ? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం.
కథ గురించి:
అది ఖాన్సార్ అరాచక సామ్రాజ్యం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతుంటుంది. ప్రత్యేక రాజ్యాంగం తయారు చేసుకొని, రాజ్యానికి నాలుగు వైపుల బలమైన గోడలు నిర్మించి అక్కడి రాజు రాజమన్నార్ (జగపతిబాబు) సామ్రాజ్య పాలన చేస్తుంటాడు. రాజ మన్నార్ తన కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరగా చేయాలని నిరయిస్తాడు. రాజ్యానికి సంబంధించిన ఓ ముఖ్యమైన పనిపై కొన్నాళ్లు బయటికివెళ్తాడు రాజ మన్నార్. ఈలోగా సింహాసనం కోసం అంతర్యుద్దం మొదలౌతుంది. మిగతా దొరలంతా కలసి వరదని అంతం చేయడానికి సైన్యాలని రప్పించుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు. అసలు ఈ దేవ ఎవరు ? వరద, దేవాల మధ్య వున్న అనుబంధం ఏమిటి ? అంత సైన్యాన్ని దేవా ఒక్కడే ఎలా ఎదురుకున్నాడు? ఈ కథలో ఆద్య (శ్రుతిహాసన్) పాత్ర ఏమిటి ? సింహాసనం కోసం జరిగిన ఈ యుద్ధంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ? అనేది తెరపై చూడాలి.
కథా విశ్లేషణ:
సింహాసనం కోసం జరిగే యుద్ధం నేపధ్యంలో నడిచే ఇద్దరి స్నేహితుల కథ సలార్. దేవ, వరదల బాల్యంతో ఈ కథని మొదలుపెట్టాడు దర్శకుడు. దేవ, వరద స్నేహం, దేవ కోసం వరద చేసిన త్యాగం, అందుకుగాను దేవ ఇచ్చిన మాట ఇవన్నీ ఆసక్తికరంగానే వుంటాయి. తర్వాత కథ అధ్య(శ్రుతి హసన్) పాత్ర వైపు నుంచి నడుస్తుంది. అద్య, దేవ తల్లి ఈశ్వరీరావు వద్ద ఆశ్రయం పొందడం, అక్కడే దేవ పరిచయం, మరోవైపు ‘ఖాన్సార్ సీల్’ తో కొన్ని పాత్రలు తెరపైకి రావడం ఆసక్తికరంగా వుంటుంది. దేవగా ప్రభాస్ పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన తీరు చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. దేవ పాత్ర మండే అగ్నిగోళంలా, నివురుగప్పిన నిప్పులా వుంటుంది. ఏ క్షణంలో పేలుతుందో తెలియని డైనమైట్ లా కనిపిస్తుంటాడు దేవ. అధ్యని విలన్స్ నుంచి కాపాడే సన్నివేశంలో ఇంజన్ స్టార్ అవ్వడానికి ముందు వచ్చే సౌండ్ ఎఫక్ట్ ని వాడుకున్న తీరు కేవలం ప్రభాస్ లాంటి కటౌట్ కే సరిపోతుంది. అంత టెర్రిఫిక్ గా ఆ యాక్షన్ సీన్ వచ్చింది.
ఇంటర్వెల్ బాంగ్ కూడా మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునేలా ఈ యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు. అక్కడ ‘ఖాన్సార్ సీల్’ బ్యాగ్ డ్రాప్ ని కాయిన్ చేసిన విధానం మాస్ ని మరో లెవల్ కి తీసుకెళుతుంది. తొలిసగం అంతా కేవలం ప్రభాస్ పాత్రకు ఒక పవర్ ఫుల్ ఇంట్రో అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో అసలు ఖాన్సార్ కథ తెరపైకి వస్తుంది. ఈ సినిమాకోసం ‘ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత అరాచక రాజ్యాన్ని సృస్టించాడు ప్రశాంత్ నీల్. ఆ రాజ్యం తాలుకూ చరిత్రని వాయిస్ ఓవర్ రూపంలో చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమంలో ఒకేసారి ఓ పదిహేను కొత్త పాత్రలు తెరపైకి వచ్చేస్తాయి.
పైగా ఖాన్సార్ రాజ్యాంగం, దాని రూల్స్, ఓటింగ్, అధికారం.. ఇవన్నీ కాస్త గంధరగోళానికి గురి చేసే అవకాశం వుంది. అయితే దేవ ఖాన్సార్ లోకి అడుగుపెట్టిన తర్వాత కథనం మళ్ళీ జోరు అందుకుంటుంది. కాళీమాత ఎపిసోడ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. తర్వాత నాగంగ్ పాత్రతో వచ్చిన సన్నివేశం కూడా యాక్షన్ ని మరోస్థాయికి తీసుకెళుతుంది. అయితే అప్పటివరకూ ప్రేక్షకులకు చాలా ప్రశ్నలు వుంటాయి. వాటన్నిటికీ తొలి సగంలో సమాధానాలు ఇవ్వలేదు కానీ.. దేవ ఎవరు ? ఈ కథతో ఆయనకి వున్న సంబంధం ఏమిటనే ట్విస్ట్ సెకండ్ పార్ట్ పై ఆసక్తికలిగేలా చేసింది.
నటీనటుల నటన:
‘కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్’’ మిర్చిలో ప్రభాస్ డైలాగ్ ఇది. దేవ పాత్ర, అందులోని హీరోయిజం చూస్తున్నప్పుడు .. ఈ డైలాగ్ మరోసారి గుర్తుకు వస్తుంది. నిజంగా ప్రభాస్ తప్పితే ఆ పాత్రకు మరో నటుడు సరితూగడు. అంత పవర్ ఫుల్ గా సాగింది దేవ పాత్ర. ఒక సన్నివేశంలో ఓ బామ్మ దేవ దగ్గరికి వచ్చి తనని తాకాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే.. ‘నువ్వు నిజమేనా.. కాదా’’ అని చెబుతుంది. అంత అన్ బిలివబుల్ గా ఉంటాడు దేవ. తన పాత్రకు ఎక్కవ డైలాగులు లేవు. చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం పేలాయి. వరద రాజమన్నార్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకట్టుకుంటాడు. తన పాత్రని తీర్చిద్దిన విధానం బావుటుంది. అధ్య పాత్రలో శ్రుతి హాసన్ సహజంగా కనిపించింది కానీ తన కథ ఏమిటనేది ఇంకా రివిల్ కాలేదు. జగపతిబాబు, మైమ్ గోపి, బాబీ సింహా, శ్రియారెడ్డి, ఝాన్సీ ఇలా పాత్రలు పరిధి మేర ఆకట్టుకున్నాయి.
టెక్నికల్ :
సాంకేతికంగా సినిమా వున్నత స్థాయిలో వుంది. ముఖ్యంగా నేపధ్య సంగీతం మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఎలివేషన్స్ సీన్స్ లో మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. కెమెరా పనితనం, ఎడిటింగ్ ప్యాట్రన్ ప్రశాంత్ నీల్ మార్క్ లో వుంది. కేజీఎఫ్ లా ఒకే సీన్ లోనే రెండు మూడు లేయర్లు కథని చూపించడంలో సలార్ కూడా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. కాన్సార రాజ్యాన్ని సెటప్ చేసిన విధానం కొత్తగా వుంటుంది. ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ ని చూపించారు. కథని పూర్తిగా రివిల్ చేయకుండా ప్రేక్షకుడిని ఒక సస్పెన్స్ లో వుంచి కథనం ఆసక్తిగా నడిపారు. ఎటుచూసిన సైన్యం, తుపాకులు, వార్ ట్యాంకర్స్ వుంటాయి. కానీ ప్రభాస్ కటౌట్ ముందు అవి చిన్నబోతుంటాయి. అంతలా హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు ప్రశాంత్ నీల్.
ప్లస్ పాయింట్స్
ప్రభాస్ హీరోయిజం,
యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్
నేపధ్య సంగీతం, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
గందరగోళానికి గురిచేసే ఖాన్సార్ చరిత్ర
కొన్ని పాత్రలు ప్రశ్నలుగా మిగిలిపోవడం.
రేటింగ్ : 3/5
సూరీడే గొడుగు పట్టి..
సలార్ ట్రైలర్..
సలార్ టీజర్..