Prakash Raj | టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా సిరీస్ ‘జగమే సంగీతం’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక సంగీత నేపథ్యంతో రూపొందిన ఈ ఒరిజినల్ సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను పల్నాటి సూర్య ప్రతాప్ సృష్టించి దర్శకత్వం వహించగా, సుష్మిత కొణిదెల నిర్మించారు.
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ ఈ సిరీస్‌కు కథను అందించగా, విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శ్రుతులతో మేళవిస్తూ ఆయన అందించిన స్వరాలు ఈ కథకు ప్రాణం పోశాయని చెప్పవచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్ వెర్షన్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
ఈ కథ విషయానికొస్తే.. కర్ణాటక సంగీత వారసత్వాన్ని కలిగిన కుటుంబం మరియు దాని మూలాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. తన తాత గారి సంగీత వారసత్వాన్ని కొనసాగించాలనుకునే బాలు అనే యువకుడు.. కుటుంబ బంధాలు, రహస్యాలు, సాంప్రదాయ కట్టుబాట్ల మధ్య ఎలా నలిగిపోయాడనేదే ప్రధానాంశం. తన కుటుంబం నిర్మించిన ప్రతిష్టను కాపాడుకుంటూనే, తనకంటూ ప్రత్యేకమైన కళాత్మక స్వరాన్ని ఎలా కనుగొన్నాడనే భావోద్వేగ ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారు.
ఈ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా ఎస్వీఓడీ ఒరిజినల్స్ హెడ్ మాట్లాడుతూ.. సంగీతంలోని భావోద్వేగ శక్తిని చాటిచెప్పే హృద్యమైన కథే ‘జగమే సంగీతం’ అని, సంప్రదాయం, ఆశయం వంటి అంశాలను ఇది అద్భుతంగా అన్వేషిస్తుందని తెలిపారు. అలాగే నిర్మాత సుష్మిత కొణిదెల మాట్లాడుతూ.. సంగీతం కేవలం ఒక కళ మాత్రమే కాకుండా, ఆ కుటుంబంలోని ప్రేమ, సంఘర్షణలను తెలిపే భావోద్వేగ భాషగా ఎలా మారుతుందో ఈ సిరీస్ ద్వారా చూపిస్తున్నామని పేర్కొన్నారు. అసాధారణ నటీనటులతో తెరకెక్కిన ఈ సంగీత భరిత ప్రయాణాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.