Online Betting | ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచార కేసు విచారణలో భాగంగా ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు. సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే కేసులో మంగళవారం నటుడు విజయ్ దేవరకొండను కూడా సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్‌లకు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రచారం చేయడంతో అనేక మంది యువకులు వాటికి బానిసలై ఆర్థిక నష్టాలతోపాటు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తుకు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసుల్లో విజయ్ దేవరకొండతోపాటు నటులు రాణా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీతో సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.