Sonakshi Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మరి కొద్ది రోజులలో ‘జటాధర’ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సుధీర్ బాబు హీరోగా, వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాక్షి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో ఆమె తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోనాక్షి, దక్షిణాది సినీ పరిశ్రమపై ప్రశంసలు కురిపిస్తూ , బాలీవుడ్ కూడా కొన్ని అంశాల్లో మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నేను ఇంతకుముందు తమిళ సినిమా ‘లింగ’ లో నటించాను. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘జటాధర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నిజానికి సౌత్ ఇండస్ట్రీలో పనిచేయాలన్న ఆసక్తి నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ వరుస షూటింగ్స్, డేట్స్ సర్దుబాటు సమస్యల వల్ల ఇప్పటివరకు సాధ్యపడలేదు అని సోనాక్షి తెలిపారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సమయపాలన, క్రమశిక్షణ గురించి మాట్లాడిన సోనాక్షి .. దక్షిణాది చిత్రసీమలో సమయపాలన నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభిస్తే సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా ముగిస్తారు. ఆ సమయానికి తర్వాత ఎటువంటి షూటింగ్ జరగదు.
ఇది చాలా మంచి పద్ధతి. కానీ బాలీవుడ్లో అయితే తరచుగా అర్ధరాత్రి వరకు షూటింగ్ కొనసాగుతుంది. ఈ విషయంలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ తప్పకుండా మారాలి, అని స్పష్టంగా పేర్కొన్నారు. ‘జటాధర’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో సోనాక్షి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అనంతపద్మనాభ స్వామి ఆలయ రహస్యాల నేపథ్యంతో ఈ కథ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. తన కెరీర్లో ఇంతవరకు చేయని ఒక విభిన్నమైన పాత్ర ఇదేనని సోనాక్షి చెప్పి, “ఈ రోల్ నాకు ఒక కొత్త ఛాలెంజ్‌లా అనిపించింది. దక్షిణాది ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. ఈ చిత్రం ద్వారా సోనాక్షి సిన్హా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనే ఆసక్తి ఫిల్మ్ సర్కిల్స్‌లో పెరిగిపోయింది.