వరుస పాన్ ఇండియా చిత్రాలతో అగ్ర హీరో ప్రభాస్ ఇమేజ్ శిఖరాగ్రానికి చేరుకుంది. ‘బాహుబలి’ మొదలు నిన్నటి ‘కల్కి’ వరకు ఆయన సినిమాల కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి స్టార్డమ్, ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ వాటి తాలూకు ప్రభావానికి లోనుకాకుండా వినమ్రశీలిగా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్. హంగూ ఆర్భాటాలకు దూరంగా, మచ్చలేని వ్యక్తిత్వంతో ఇండస్ట్రీలో అజాతశత్రువుగా గుర్తింపు పొందారు. ఆయన సహృదయత, మృదుస్వభావానికి ఫిదా అయిన అభిమానులు డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. నేడు ప్రభాస్ జన్మదినం. ఈ సందర్భాన్ని ఆయన అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
ఇక వరుస పాన్ ఇండియా చిత్రాలతో మరో రెండేళ్లపాటు ప్రభాస్ బిజీగా ఉండబోతున్నారు. ఈ నెల 31న ‘బాహుబలి ది ఎపిక్’ రీరిలీజ్ అవుతున్నది. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘ది రాజాసాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ డిసెంబర్లో పట్టాలెక్కనుంది. ఆ తర్వాతి లైనప్లో సలార్-2, కల్కి-2 రాబోతున్నాయి. ఇలా వరుస చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు.