Prabhas vs Vijay | సంక్రాంతి సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ థియేటర్ల వద్ద పోటీ మరింత తీవ్రంగా మారుతోంది. ఈసారి పండుగకు ఏకంగా ఐదు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో, స్క్రీన్ల పంపకం పెద్ద సవాలుగా మారింది. ఈ పోటీ మధ్యలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ పై అన్యాయం జరుగుతోందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను వినోదాత్మక, వింటేజ్ స్టైల్లో చూపిస్తున్న సినిమా కావడంతో ‘ది రాజాసాబ్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలోకి రానుండగా, అదే రోజున తమిళ స్టార్ విజయ్ తళపతి నటించిన ‘జన నాయకుడు’ కూడా విడుదలకు సిద్ధమైంది. దీంతో రెండు సినిమాల మధ్య థియేటర్ల పంపకంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రెండు సినిమాలకు సమానంగా స్క్రీన్లు కేటాయిస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల ‘జన నాయకుడు’కు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని ప్రభాస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అక్కడ జనవరి 9న ‘ది రాజాసాబ్’కు సరిపడా థియేటర్లు దొరకకపోవడంతో, ఒక రోజు ఆలస్యంగాను అలానే చాలా పరిమిత స్క్రీన్లలో విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
ఈ పరిణామంపై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇతర భాషల్లో తమ హీరో సినిమాలకు సరైన అవకాశాలు ఇవ్వకపోతే, మన ప్రాంతాల్లో మాత్రం ఇతర భాషల సినిమాలకు పెద్ద ఎత్తున థియేటర్లు కేటాయించడం న్యాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ థియేటర్ పంపకం అంశంపై చిత్ర బృందం నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. రాజా సాబ్ చిత్రం విషయానికి వస్తే ఈ మూవీని మారుతి తెరకెక్కించగా, చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ కావడంతో ఈ సినిమాని చూసేందుకు కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.