భారీ పాన్ ఇండియా లైనప్ చేసుకున్న హీరో ప్రభాస్..ఆ చిత్రాలను పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాల షెడ్యూల్స్ కోసం ఎప్పటికప్పుడు తన ప్రాధామ్యాలను మార్చుకుంటున్నారు. ఒక దశలో ‘సలార్’, ‘ఆదిపురుష్’కు ఎక్కువ సమయం కేటాయించిన ప్రభాస్.. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’తో పాటు మారుతి మూవీకి ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారీ స్టార్.
రొమాంటిక్ థ్రిల్లర్ కథతో ఎంటర్టైనింగ్గా ఈ సినిమా రూపొందుతున్నది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఆ తర్వాత ఈ సెట్ నుంచి ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్, దిశా పటానీ ప్రభాస్తో ఆడిపాడనున్నారు. అమితాబ్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చే నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది.