మహాపుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. శివలీలలే ప్రధానాంశమైన ఈ సినిమాలో దైవికంగా వచ్చే వివిధరూపాలలో దేశంలోనే పేరెన్నికగన్న పెద్ద పెద్ద స్టార్లే నటించారు. వారిలో ప్రభాస్ ఒకరు. రీసెంట్గా ఇందులోని ప్రభాస్ పాత్ర గురించి మంచు విష్ణు మాట్లాడుతూ ‘ముందు ప్రభాస్‌ని అతిథిపాత్రకు అనుకున్నాం. తర్వాత 30 నిమిషాలు పెంచాల్సొచ్చింది. మొత్తంగా చివరి 50 నిమిషాల్లో ప్రభాస్ కనిపిస్తారు. ప్రభాస్, మా నాన్న మోహన్‌బాబుగారు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ప్రభాస్ కెరీర్లోనే నటనపరంగా ‘కన్నప్ప’ బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రభాస్. ఇందులో గెస్ట్‌గా చేయాలి.. అని అడగ్గానే వెంటనే అంగీకరించాడు.
రక్తం పంచుకొని పుట్టకపోయినా ప్రభాస్ నా మంచిని కోరాడు. ‘కన్నప్ప’ పెద్ద హిట్ అవుతుందని ప్రతిసారీ చెబుతూనే ఉన్నాడు. గతంలో నా సినిమాల విడుదలకు ముందు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టనా అని అడిగేవాడు. ఈ రోజుల్లో అలా ఎవరుంటారు? అందుకే ప్రభాస్‌కి జీవితాంతం రుణపడి ఉంటా.’ అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ఇందులో ప్రభాస్ ‘నందీశ్వరుడు’గా కనిపిస్తాడని తెలుస్తున్నది. శివుని వాహనమైన నంది.. శివకార్యం కోసం మానవరూపంలో భూమిమీదకు దిగితే ఎలా ఉంటుందో ప్రభాస్ పాత్ర చెబుతుందని ఇన్సైడ్ టాక్. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.