ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్’ చిత్రం మే నెలలో పట్టాలెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇందులో ప్రభాస్ వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి పవర్ఫుల్ న్యూఏజ్ కాప్ స్టోరీ ఇదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పలు ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి సోషల్మీడియాలో విస్తృతంగా వార్తలొస్తున్నాయి.
మధ్యతరగతి నుంచి స్వశక్తితో ఎదిగిన పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, ఆయనకు భార్య, నాలుగేళ్ల కూతురు కూడా ఉంటుందని, కుటుంబాన్ని ప్రాణప్రదంగా భావించే పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకునే అనుకోని సంఘటనలు, అతన్ని ఓ బలమైన శత్రువును ఢీకొట్టే లక్ష్యం వైపు ఎలా నడిపించాయన్నదే కథాంశమని ఆ వార్తల సారాంశం. అయితే వీటిని సందీప్ రెడ్డి అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఈ తరహా సాధారణ రివేంజ్ స్టోరీని ఆయన ఎంచుకోడని, ‘స్పిరిట్’ కథలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని అంటున్నారు. మరి నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.