Salaar | ‘నీకోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా.. నీ ఒక్కడికోసం.. నువ్వెప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా..’ ప్రభాస్ ‘సలార్’లోని డైలాగ్ ఇది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. అందులో ప్రథమంగా వినిపించేది ఈ డైలాగే. ఈ ఒక్క డైలాగ్‌తో దాదాపు కథంతా చెప్పేశాడు ప్రశాంత్‌నీల్. ఇది ఇద్దరు మిత్రుల కథ అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఆ స్నేహితులుగా ప్రభాస్, మలయాళం హీరో పృధ్వీరాజ్ నటించారు.
వందలఏళ్ల క్రితం మొదలైన కథగా ‘సలార్’ని వాయిస్ఓవర్ ద్వారా పరిచయం చేశాడు దర్శకుడు ప్రశాంత్‌నీల్. వందలయేళ్ల క్రితం మహ్మద్ గజనీ, ఛంఘిజ్‌ఖాన్ కంటే క్రూరమైన బందిపోట్లు ఉండేవాళ్లు. వాళ్లు శతాబ్దాలపాటు ఎదురులేకుండా పాలించిన ప్రాంతమే ‘కాన్సార్’. కాలక్రమంలో అదో సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు అక్కడ కూడా కుర్చీకోసం కుతంత్రాలు మొదలయ్యాయి. ఆ సామ్రాజ్యానికి అధిపతి కావాల్సిన వరదరాజ్ మన్నార్ని తప్పించి, సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వేలాదిగా ముష్కరులు కన్సార్లోకి అడుగుపెట్టారు. ఇప్పడు వరదరాజ్ మన్నార్ ఒంటరి. అతన్ని కాపాడే సైన్యం ఎవరు?. ఆ ప్రశ్న ఉత్పన్నవ్వగానే, అతని నోటివెంటే వినిపించే పేరు ‘దేవ’. దేవాగా ప్రభాస్ ఎంట్రీ ట్రైలర్లో గూజ్బంబ్స్ తెప్పించిందనే చెప్పాలి. కన్సార్లోకి తనొచ్చాడు. సమస్యను చక్కదిద్ది వెళ్లిపోయాడు. దాదాపు సినిమా కథంతా ఉందీ ట్రైలర్లో.
3నిమిషాల 46 సెకన్స్ ట్రైలర్లో, రెండు నిమిషాల 18 సెకన్ల కంటెంట్ పూర్తయ్యే వరకూ హీరో ఎంట్రీ జరగదు. లేట్‌గా కనిపించినా ఎంట్రీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ‘పెద్దపెద్ద గోడలు కట్టేదే భయపడి.. బయటికెవడు పోతాడనికాదు.. లోపలికెవడొస్తాడని..’ డైలాగ్ సూపర్. స్నేహితుడికోసం ‘ఎరైనా అవుతా.. సొరైనా అవుతా’ అని చెప్పిన స్నేహితుడి కథే ఈ ‘సలార్’. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడీ ట్రైలర్ వాటిని రెట్టింపుచేసిందని చెప్పక తప్పదు.