హారర్ ఫాంటసీ ‘ది రాజాసాబ్’తో సంక్రాంతి బరిలో దిగుతున్నారు అగ్ర హీరో ప్రభాస్. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇటీవలే భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మేకర్స్ సోమవారం తాజాగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నానమ్మ.. ఈ ప్రపంచంలో నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా..ఆయన్ని మాత్రం అస్సలు మర్చిపోలేవు’ అనే ప్రభాస్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అనూహ్య మలుపులు, గ్రాఫిక్స్ హంగులతో ఆకట్టుకుంది.
నాయనమ్మ గంగమ్మ (జరీనా వాహబ్) కోరిక మేరకు తన తాతను (సంజయ్‌దత్) కలుసుకోవడానికి మయసభలాంటి భారీ హవేలీలోకి అడుగుపెడతాడు రాజాసాబ్. హిప్నాటిజంతో పాటు దుష్టశక్తులను నియంత్రించగల సామర్థ్యం ఉన్న తాత హవేలీలో సృష్టించిన బీభత్సం ఏమిటి? ఆ ఉచ్చు నుంచి రాజాసాబ్ ఎలా బయటపడ్డాడు? హవేలీలో తన లక్ష్యాన్ని రాజాసాబ్ పూర్తి చేశాడా? వంటి అంశాలతో ట్రైలర్ ప్రతిక్షణం ఉత్కంఠను పంచింది.
ట్రైలర్ చివరలో ప్రభాస్ జోకర్ గెటప్‌లో కనిపించి కథపై మరింత సస్పెన్స్‌ను పెంచారు. అబ్బురపరిచే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్, సంజయ్‌దత్, బొమన్ ఇరానీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీ తం: తమన్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి.