Project-K Shooting Update | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే వచ్చిన ‘రాధేశ్యామ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ‘సాహో’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు డార్లింగ్‌ను వెండితెరపై చూడబోతున్నామని ఆశతో వచ్చిన అభిమానులను ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ అప్డేట్లు ఏమి రాకుండానే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నియి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘ప్రాజెక్ట్-K’ షూటింగ్ 55 శాతం పూర్తయిందట. చిత్ర యూనిట్ ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌కు సంతృప్తికరంగా ఉన్నారట. ఎట్టి పరిస్థితులో షూటింగ్ ఈ ఏడాది చివరివరకు పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమాకు విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సై-ఫై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
ఇక ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. దీనితో పాటుగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 30% వరకు షూటింగ్ పూర్తి చేసుకుందట.