Rebel Star Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన జోరును మరింత పెంచాడు. ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా చేసే పాత పద్ధతికి స్వస్తి పలికి, ప్రస్తుతం ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ‘ది రాజాసాబ్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఈ చిత్రం అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాల చిత్రీకరణలో ఆయన బిజీగా గడుపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ మరో సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకాబోతుండగా.. ఈ సినిమా షూటింగ్లో వచ్చే నెల నుంచి ప్రభాస్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయగా, ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభాస్ ఒకే సమయంలో మూడు భిన్నమైన జానర్లకు సంబంధించిన సినిమాలను (ఫౌజీ, స్పిరిట్, కల్కి 2) ముందుకు నడిపించబోతున్నారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభాస్ తన పని వేగాన్ని పెంచారు. భారీ హంగులతో, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాలు ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ది రాజాసాబ్’ విడుదల తర్వాత గ్యాప్ లేకుండా తన తదుపరి చిత్రాలను థియేటర్లలోకి తీసుకువచ్చేలా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.