Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్–ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. సినిమా రిజల్ట్ నేపథ్యంలో దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ప్రభాస్–మారుతి మళ్లీ కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారని, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారానికి పులిస్టాప్ పెట్టేలా ప్రభాస్ పీఆర్ టీమ్ స్పష్టత ఇచ్చింది. అధికారిక ప్రకటన లేకుండా ఇలాంటి వార్తలు నమ్మవద్దని తెలిపింది.
దీంతో ప్రభాస్–మారుతి కాంబోలో కొత్త సినిమా లేదని కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలోని ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తైన తర్వాత నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్లో ఆయన జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ‘ది రాజా సాబ్’ థియేటర్లలో మిక్స్డ్ టాక్ దక్కించుకున్నప్పటికీ డిజిటల్లో కొత్త ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకోగా, ఫిబ్రవరి 6 నుంచి తెలుగుతో పాటు ఇతర పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించగా, సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహాబ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కథ విషయానికి వస్తే, దేవనగర సంస్థానానికి చెందిన జమీందారు గంగాదేవి తన మనవడు రాజుతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటుంది. మతిమరుపుతో బాధపడుతున్న ఆమె, తన భర్త కనకరాజును వెతికి తీసుకురావాలని రాజును కోరుతుంది. ఆ అన్వేషణలో హైదరాబాద్‌కు చేరుకున్న రాజు, అనూహ్యంగా ఓ రహస్య రాజమహల్‌కి చేరతాడు. అక్కడ దాగి ఉన్న భయంకరమైన నిజాలు, కనకరాజు అసలు ఉద్దేశాలు, రాజు జీవితంలోకి వచ్చిన ముగ్గురు యువతుల పాత్రలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. ఈ మిస్టరీలు ఎలా రివీల్ అవుతాయి అన్నదే ‘ది రాజా సాబ్’ కథాంశం.