Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. 50కు చేరువవుతున్నా ఇప్పటికీ వివాహం చేసుకోకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఎన్నో పుకార్లు వెలువడినా, వాటిలో ఒక్కదానిపై అధికారిక ప్రకటన లేదు. అయితే ప్రభాస్ పెళ్లి టాపిక్ రాగానే ముందుగా వినిపించే పేరు హీరోయిన్ అనుష్క శెట్టి. వీరిద్దరూ 2009లో “బిల్లా” చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచి ప్రేమలో ఉన్నారని గాసిప్స్ వినిపించాయి. దాదాపు 16 ఏళ్లుగా ఈ జంటపై ఊహాగానాలు ఆగడం లేదు. కానీ ప్రభాస్-అనుష్కలు మాత్రం తమ మధ్య అలాంటి సంబంధం లేదని అనేకసార్లు స్పష్టంగా చెప్పారు.
గతేడాది ఒక ప్రముఖ ఆంధ్రా వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ నిశ్చితార్థం జరిగిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ వివాహ ఏర్పాట్లన్నీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి స్వయంగా చూస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన “అన్‌స్టాపబుల్” షోలో కూడా రామ్‌చరణ్ ఒక క్లూ ఇచ్చాడు. ఏపీలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ప్రభాస్ చెల్లెల్లు అందంగా ముస్తాబై కనిపించిన ఫోటోలు బయటకు రావడంతో ఆయన ఇంట్లో పెళ్లి సందడి అంటూ వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అవి బంధువుల పెళ్లి ఫోటోలు అని తేలిపోయింది. దీంతో మరోసారి ఫ్యాన్స్ నిరాశ చెందారు. ప్రభాస్ పెళ్లిపై ఫ్యాన్స్ నుంచి “ప్లీజ్ అన్న.. పెళ్లి చేసుకోండి” అన్న విన్నపాలు విపరీతంగా వస్తున్నాయి.
తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి, తుని సమీపంలోని తలుపులమ్మ లోవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలుస్తోంది. కుంకుమార్చన, ప్రత్యేక హోమాలు చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫిలింనగర్ వర్గాల కథనం ప్రకారం.. ప్రభాస్ వివాహం త్వరగా జరగాలని, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చేసిన పూజలంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ మోకాలి నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని, కెరీర్ మళ్లీ ఫుల్ స్వింగ్‌లోకి రావాలని శ్యామలా దేవి పూజలు చేయించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.