‘కల్కి 2898ఏడీ’ సినిమా ముగింపులో సీక్వెల్‌కి అద్భుతమైన లీడ్ ఇచ్చారు దర్శకుడు నాగ అశ్విన్. దీన్ని ఎలా మొదలుపెడతారో, ఏ విధంగా ముగింపు పలుకుతారో చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఈ అంశంపై ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగు చూసింది. ‘కల్కి 2898ఏడీ’ సినిమాను కర్ణుడి పాత్రపై ముగించారు దర్శకుడు నాగ అశ్విన్. రాబోతున్న సీక్వెల్లో కూడా కర్ణుడి పాత్ర ప్రముఖంగానే ఉంటుందని తెలుస్తున్నది.
అందుకే.. ఈ సీక్వెల్‌కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. మహాభారతంలోని కర్ణుడే.. ‘భైరవ’గా జన్మించినట్టు ‘కల్కి 2898ఏడీ’లో చూపించారు దర్శకుడు నాగఅశ్విన్. మరి సెకండ్ పార్ట్‌లో కర్ణుడి పాత్ర ఏంటి? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. సుప్రీమ్ యాస్కిన్(కమల్‌హాసన్) అత్యంత శక్తిమంతుడిగా మారాడు. కర్ణుడు(ప్రభాస్), అశ్వథ్థామ(అమితాబ్) ఏకం అయ్యారు.
ఇక యుద్ధం అనివార్యం. మరి అది ఎలా ఉంటుందో, నాగఅశ్విన్ ఎలా తీస్తారో చూడాలి. ఇదిలావుంటే.. ఈ సినిమానుంచి దీపికా పదుకొణెని తప్పించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో అనుష్క, నయనతార, అలియాభట్ ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే.. ఫైనల్‌గా రుక్మిణీ వసంత్‌కి ఆ అవకాశం వరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.