Prabhas | ప్రస్తుతం ఉన్న సక్సెస్ఫుల్ నటవారసులంతా ‘తండ్రులకి తగ్గ తనయులు’, ‘అన్నలకు తగ్గ తమ్ముళ్లు’, ‘తాతలకు తగ్గ మనవళ్లు’. కానీ ప్రభాస్‌ను మాత్రం వీరితో మినహాయించాలి. ఎందుకంటే.. ప్రభాస్ ‘తండ్రికి తగ్గ తనయుడు’ కాదు. ‘తండ్రిని మించిన తనయుడు’. ఈ మాటను నిర్మొహమాటంగా, నిర్భయంగా ఢంకా బజాయించి మరీ చెప్పేయొచ్చు. స్వతహాగానే ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఛాతి కాస్త వెడల్పు. ప్రభాస్ పుణ్యమా అని.. గోరంత గర్వంతో.. కొండంత ఆనందంతో అది ఇంకాస్త వెడల్పయింది. జీవించి ఉన్నంతకాలం పెదనాన్నకు కావల్సినంత పుత్రోత్సాహాన్ని ఇచ్చేసిన తనయుడు ప్రభాస్.
2004 సంక్రాంతి గుర్తుందా? ప్రభాస్ మూడో సినిమా ‘వర్షం’. కాసుల వర్షమే కురిపించేసింది. ‘ఛత్రపతి’లో ‘ఒక్క అడుగు’ అని అడిగినందుకు అభిమానులు అడుగడుగునా గుండెలలో గుడులు కట్టేశారు. ఇక ‘బాహుబలి’ గురించి చెప్పేదేముంది.. ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లు. ‘సలార్’ 600కోట్లు. రీసెంట్ హిట్ ‘కల్కి 2898 ఏడీ’ వెయ్యికోట్లు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా హిట్ అయితే వెయ్యికోట్లు. ఫ్లాపైతే 200కోట్లు. అసలు ‘ఈశ్వర్’ టైమ్‌లో ఇంతటి వైభవం ఊహించామా!? పాన్ ఇండియా స్టార్‌డమ్‌ని ప్రపంచానికి పరిచయం చేయడమంటే సామాన్యమైన విషయమా!? .. కటౌట్‌ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి.. తప్పదు. నేడు ప్రభాస్ పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమనులకు ఇదే పెద్ద పండగ.