Fish Venkat | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులకి దగ్గరైన నటుడు ఫిష్ వెంకట్. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో “తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో గుర్తింపు పొందిన వెంకట్, ఆ తరువాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం ఏమంత బాగుండడం లేదు. వెంకట్ గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వంటి వ్యాధులతోనూ బాధపడుతున్నారు. గతంలో, ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ సమయంలో ఆయన కోలుకున్నారు. కొంతకాలం ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ మధ్య మళ్లీ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. ఫిష్ వెంకట్ చికిత్స కోసం సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు.
వైద్యుల ప్రకారం, ఫిష్ వెంకట్‌కు సరైన చికిత్స అందిస్తే, ఆయన బతికే అవకాశం ఉంది. ప్రస్తుతం, కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు, అయితే ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. ఫిష్ వెంకట్‌ను బతికించేందుకు కిడ్నీ మార్పిడి తప్పనిసరిగా చేయాలి. అలా చేయగలిగితే ఆయన బతికే అవకాశాలు ఉండవచ్చు అని వైద్యులు చెప్పారు.ఇక తాజాగా వెంకట్ కూతురు మీడియాతో మాట్లాడుతూ.. నాన్న బ్రతకాలంటే కిడ్నీతప్పనిసరిగా మార్చాలి. మా ఇంట్లో వాళ్ల బ్లడ్తో నాన్నది మ్యాచ్ కావడం లేదు. కిడ్నీ మార్పుకి రూ.50లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే అంత మొత్తం చెల్లించేందుకు ప్రభాస్ సిద్ధంగా ఉన్నారని వెంకట్ కూతురు తెలిపింది. ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి కిడ్నీ ఇచ్చే దాత ఎవరైన ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కి కావల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు ఫిష్ వెంకట్ కూతురు తెలిపింది.