Prabhas | ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే మెంటలెక్కుతుంది.. ‘సలార్’, ‘కల్కి’ విజయాలతో ఊపు మీద ఉన్న రెబల్ స్టార్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో అభిమానులను ఆనందపరిచేస్తున్నారు. భారీ హిట్లతో మంచి ఉత్సాహం అందిపుచ్చుకున్న ప్రభాస్ తన కెరీర్లో మరింత దూసుకుపోతున్నాడు. ‘సలార్’ విజయం, ఆ తర్వాత ‘కల్కి 2898 ఏ.డి.’ లాంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ప్రభాస్ ఖాతాలో చేరడంతో అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. కల్కి సినిమా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీలో సంచలనంగా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ ఎంటర్టైనర్లో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయనున్నట్టు సమాచారం.
రాజా సాబ్ తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే టైటిల్ ఫిక్స్ కాగా, ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పుడో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. స్పిరిట్‌లో ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారని టాక్. స్పిరిట్ కథలో హీరో తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్టు సమాచారం. యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా ఎలా ఆకట్టుకున్నాడో గుర్తుండే ఉంటుంది. అలాగే స్పిరిట్లోనూ ఆ స్థాయిలో ఒక పవర్ఫుల్ ఫాదర్ రోల్ ఉండబోతుందని, ఆ పాత్ర కోసం చిరంజీవిని సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ.
సందీప్ రెడ్డి వంగ ..చిరంజీవిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. మెగాస్టార్ ఒప్పుకుంటే ఇది టాలీవుడ్‌లోని మరో భారీ కలయికగా నిలిచే అవకాశం ఉంది. ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ చిరు – ప్రభాస్ లాంటి ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనేది అభిమానుల కల. ఈ వార్త నిజమైతే, స్పిరిట్ సినిమాపై ఆసక్తి మరింత రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి .. విశ్వంభర, మన శంకర్ వర ప్రసాద్ గారు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇందులో విశ్వంభర వచ్చే ఏడాది సమ్మర్‌కి రానుండగా, మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి రానుంది.