ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్’ చిత్రం గత ఏడాదికాలంగా అభిమానుల్ని ఊరిస్తూనే ఉంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాన్నాళ్లయింది. దాంతో రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిసింది. ప్రభాస్ తాజా చిత్రాలు ‘ది రాజా సాబ్’ ‘ఫౌజీ’ శరవేగంగా షూటింగులను జరుపుకుంటున్నాయి.
‘ది రాజా సాబ్’ చివరిదశకు చేరుకుంది. సెప్టెంబర్‌లోగా ‘ఫౌజీ’ పూర్తయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’ను దసరా రోజున సెట్స్ మీదకు తీసుకురావడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. నిజాయితీ, ధిక్కార స్వభావం కలిగిన అగ్రెసివ్ పోలీసాఫీసర్‌గా ప్రభాస్ పాత్ర డిఫరెంట్ షేడ్స్‌లో సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే కొన్ని లొకేషన్స్‌ను ఖరారు చేశారని తెలిసింది.